నరసింగాపాడు క్షేత్రం

అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి సమగ్ర చరిత్

నరసింగపాడు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ చరిత్ర క్షేత్ర మహాత్మ్యం

పలనాడు సీమలో నకరికల్లు ప్రాంతంలోని నరసింగపాడు గ్రామములో ఆది దంపతులు అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరులుగా వెలసి విరాజిల్లుతున్నారు. ఈ క్షేత్రము అతి ప్రాచీనమై అనాదిగా సిద్ధపురుషుల చేత అర్చించబడుతున్నది. ఈ ఆలయం అతి ప్రాచీనమనుటకు ఆలయ అధిష్టాన మూర్తులు మరియు గర్భాలయమునకు వెనుకనున్న పడమటి గోడ మీద వున్న నాగకన్య, క్షేత్ర గోడకు వాయువ్య దిశలో బయట ఉన్న నాగ దేవతా మూర్తులు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. మహా మహిమాన్వితులైన, మానవాతీత శక్తి సంపన్నులైన, పవిత్ర జీవులైన ఋషీశ్వరులు, సిద్ధులు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ తేజోరీతిలో వచ్చి ఈ ఆలయంలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడిని అభిషేకించి ఆ అర్చనా ఫలితాన్ని "తత్ బ్రహ్మార్పణమస్తు" అని ధారపోసి వెళుతున్నారు. ఎందరో భక్తాగ్రేసరులు ఆ ఋషీశ్వరాదులను చూసి తరించిన దృష్టాంతములు అనేకం కలవు. ఈ గ్రామమునకు దగ్గరలో శివ నామముతో "త్రిపురాంతకం" అనే ప్రాంతములో నరసింగపాడు కొలువు తీరి ఉండగా, ఈ నరసింగపాడు గ్రామములో విశ్వేశ్వరుడు పూజలందుకొనుట యాదృచ్ఛికం కాదు. ఇది కేవలం శివ కేశవ లకు భేదము లేదని తెలిపే దైవసంకల్పమే. శాలివాహన శకం 1099-1100 సం|| (అనగా ఆంగ్ల 1178 సం||) లో సుప్రసిద్ధమైన ఆంధ్ర మహాభారత యుద్ధముగా ప్రాచుర్యము పొందిన పలనాటి యుద్ధ రాజు వంశీయులు, ఈ క్షేత్రమునకు వచ్చి స్వామివారిని దర్శించి అనుగ్రహ పాత్రులైనారని ఐతిహ్యక గ్రంథములలో ఉన్నది. ఆ కాలములో ఉత్తర భారతంలో ఉన్న మొక్క ధామముగా ప్రసిద్ధిపొందిన కాశీ క్షేత్ర దర్శనం అతి వ్యయ ప్రయాసలతో కూడి దుర్లభముగా ఉండేది. కానీ ఎందరో మోక్షకాములు ఈ క్షేత్రమును దర్శించి స్వామి వారిని ఆరాధించి శివ సాయుజ్యం పొందారు. అందుకే ఈ క్షేత్రము "పలనాటి కాశీ"గా ప్రశస్తి నొందినది.

పూర్వము నరసింగపాడు, గుత్కపల్లి, గుత్తికొండ గ్రామ ప్రాంతములు అరణ్యారణ్యంగా పిలువబడేవి. ఈ నరసింగపాడు గ్రామములోని ఈ ప్రశస్తమైన భూమిలో ఈశాన్య, నైరుతి ప్రాంతములలో పమిడిమర్రి వంశస్థులవి కాగా, ఆగ్నేయ, వాయువ్య ప్రాంతములు చెరుకుపల్లి వంశస్థులవి. ఈ వాయువ్య ప్రాంతములోనే ఈ ప్రాచీన ఆలయము కలదు. చాలా కాలము వరకు ఉపేక్షించబడిన ఈ ఆలయ అభివృద్ధికి శివ భక్త పరాయణులైన పమిడిమర్రి, చెరుకుపల్లి వంశస్థులు స్వామివార్లకు అవిచ్ఛిన్నముగా ధూప, దీప, నైవేద్యములు జరిగే విధముగా, అర్చకుల జీవన భృతికి సరిపోవునట్లుగా కొంత భూమిని ఆలయ మాన్యంగా స్వామి వారికి సమర్పించారు. బ్రాహ్మణ గోత్రీకులైన కొమ్మవరపు వంశీయులు అనాదిగా ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. శాలివాహన శకం 1880 సం|| (అనగా 1958 సం||) లో అప్పటి ఆలయ ధర్మకర్త అయిన చెరుకుపల్లి వెంకట శివయ్యగారు సంకల్పబలంతో పూజ్యులైన పరమ హంస పరివ్రాజకాచార్య శ్రీ బెల్లంకొండ స్వాముల వారు మరియు గుంటూరు జిల్లా చౌటపల్లి వద్దగల కొత్తరెడ్డిపాలెం ఆశ్రమ వాసి శ్రీ కొమ్మరాజు లక్ష్మీ కాంతానంద యోగి వర్యుల సంయుక్త ఆధ్వర్యంలో 40 దినములు విశేషమైన అర్చనలతో సంప్రోక్షణ కార్యక్రమము నిర్వహించి ఆలయ ప్రశస్తిని ఇనుమడింప చేశారు. ఆ సందర్భములోనే కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ ఆలయమును సందర్శించి స్వామిని స్తుతిస్తూ 100 పద్యములను రచించి శ్రీశైల మల్లిఖార్జున, శ్రీకాళహస్తి మహాదేవస్తుతులతో పాటుగా తమ "మధ్యాక్కరలు" అనే పద్య కావ్యములో పొందుపరిచారు. ఈ శతకములో విశ్వనాథ వారు "నెకరికల్లు ప్రాంత సిద్ధాభి హేళ" అను దానిని మకుటముగా ఉంచారు.

శ్రీతమాల శ్యామలింగ! సిద్ధ సంసేవిత లింగ!
హేతుహీన సనాథ! అన్నపూర్ణా సహిత విశ్వనాథ
నీతపార ధునిక జాతజూటా! మణిశశి కిరీట!
శ్వేత వియన్వాణి నెకరికల్లు ప్రాంత సిద్ధాభి హేళ!

ఈ కావ్యమునకే వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినది. తదుపరి స్వామి వారి అనుగ్రహముతో అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్నారు. ఈ విధముగా విశేషముగా అర్చింపబడుతున్న విశ్వేశ్వరుడు కృషి విజ్ఞానముతో గ్రామములలో సిరులు కురిపిస్తున్నాడు. ఈ క్షేత్రములో సహజసిద్ధముగా ఏర్పడిన నీటి బుగ్గ నుండి పాతాళ గంగాజలము ఉబికి వస్తూ పంటల అభివృద్ధికి కారణమవుతోంది. భక్తుల అనుభవాలలో కొమ్మవరపు జోకయ్య గారు మహామునిని దర్శించగా, గోపిరెడ్డి నాగయ్య గారు శివలింగంపై శ్వేత సర్పాన్ని దర్శించారు. ఇలాంటి అనుభవాలు అనేకం ఉన్నాయి. ఈ క్షేత్ర అభివృద్ధికి "శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవస్థాన అభివృద్ధి మండలి" సేవలు అందిస్తూ, భక్తులకు సకల శ్రేయస్సులు ప్రసాదించబడుతున్నాయి.

ప్రత్యక్ష మహిమలు

🌊 పాతాళ గంగ

ఈ గ్రామంలో భూగర్భ జలం గంగాదేవి స్వరూపంగా భావిస్తారు. రైతులు బోరు బావులు వేసినప్పుడు మోటారు అవసరం లేకుండానే నీరు భూమి నుండి పైకి ఉబికి రావడం ఇక్కడి గంగమ్మ మహిమకు ప్రత్యక్ష నిదర్శనం.

🌾 దక్షిణ ముఖ అన్నపూర్ణ

అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉండి గ్రామాన్ని చూస్తుండటం వల్ల, గ్రామంలో మూడు పంటలు సమృద్ధిగా పండుతాయని, ఆకలి అనేది ఎరుగని క్షేత్రమని రైతుల నమ్మకం.

విగ్రహ విశిష్టత

  • ఉర్వారుక లింగం: తేనె రంగులో ఉండి దోసపండు ఆకారంలో ఉండే ఈ లింగం అత్యంత అరుదైనది.

  • సంతాన ప్రాప్తి: సంతానం లేని వారు 5 సోమవారాలు స్వామికి ప్రదక్షిణలు చేస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని వేల మంది భక్తుల నమ్మకం.

వైభవ పూజా కైంకర్యాలు

కార్తీక అమావాస్య అన్నాభిషేకం

కార్తీక అమావాస్య నాడు 121 కేజీల అన్నంతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి, రాత్రి కోనేటిలో హంస వాహనంపై తెప్పోత్సవం జరుపుతారు. సుమారు 20,000 మంది భక్తులు ఈ వేడుకకు హాజరవుతారు.

అష్టోత్తర శత కలశాభిషేకం

ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె వంటి 11 రకాల పవిత్ర ద్రవ్యాలతో 108 కలశాలతో స్వామివారికి జరిగే ఈ అభిషేకం అత్యంత శక్తివంతమైనది.

⚔️ వీరత్వ చరిత్ర

పల్నాటి బ్రహ్మనాయుడు గారు యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఆలయంలోనే తన ఖడ్గానికి పూజ చేసేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామిని సేవించిన వీరులకు విజయం తథ్యమని నమ్మేవారు.

📜 సాహిత్య వైభవం

ప్రసిద్ధ కవి శ్రీనాథుడు ఈ క్షేత్ర సందర్శనలో స్వామివారి వైభవాన్ని, ఉర్వారుక లింగ విశిష్టతను వర్ణిస్తూ చాటువులను రచించారు. వేయిపడగలు' నవలా చక్రవర్తి, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తన కీర్తనలలో కూడా ఈ దేవాలయం (క్షేత్రం) యొక్క విశిష్టతను అద్భుతంగా రచించారు

వన సమారాధన & గో రక్షణ

రావిచెట్టు రహస్యం

వందల ఏళ్ళ నాటి రావిచెట్టు కింద సిద్ధులు అదృశ్య రూపంలో ధ్యానం చేస్తారని ప్రతీతి.

గోశాల

గోవుల పాలతోనే నిత్యం స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం.

రాజగోపుర వైభవం

2009లో జరిగిన ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా నిర్మించిన ఈ రాజగోపురం పల్నాటి ప్రాంతానికే తలమానికం. కాళహస్తి తరహాలో ఇక్కడ జరిగే రాహు-కేతు పూజలు భక్తుల దోషాలను హరిస్తున్నాయి.

"ఓం నమః శివాయ"

Eternal Sanctity of Narasingapadu